మన దేశంలో హెచ్3ఎన్ 2వైరస్ అలజడి రేపుతోంది. దేశంలో ఇప్పటికే ఈ వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా.. ఈ వైరస్ (హెచ్3ఎన్ 2) బారినపడి ఇద్దరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఒకరు, హర్యాణాలో ఒకరు హెచ్3ఎన్ 2 వైరస్ బారిన పడి మృతి చెందినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్3ఎన్ 2 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ఎనిమిది హెచ్ఎ1న్ 1 కేసులు (ఇన్‌ఫ్లుయెంజా మరో రకమైన వైరస్) కూడా నమోదైనట్లు తెలిపింది.
హెచ్3ఎన్ 2 వైరస్‌నే ‘హాంకాంగ్ ఫ్లూ’ అని పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా దేశంలో గత రెండు నెలలుగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఇప్పటికే కొన్ని సూచనలను జారీ చేసింది.
ఇన్‌ఫ్లుయెంజా కేసుల్లో కొవిడ్ -19, సాధారణ జలుబు తరహా లక్షణాలే ఉంటున్నాయి. సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేసినవారు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ వైరస్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఆసుపత్రుల్లో చేరికలకూ ఇది కారణం అవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల తెలిపింది.
హెచ్3ఎన్2 లక్షణాలు
★ జ్వరం
★ చలి
★ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
★ తీవ్రమైన దగ్గు
★ గొంతునొప్పి
★ అలసట
★ వాంతులు
★ కొంత మందిలో విరేచనాలు కూడా ఉంటున్నాయి.
ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5 నుంచి 7 రోజుల వరకు ఉంటోంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయినా.. దగ్గు మాత్రం 3 వారాల వరకూ ఉంటోంది. ఆందోళన చెందొద్దనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.