వచ్చే వేసవి మొదలుకానున్న నేపథ్యంలో అధికారులు త్రాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి తెలిపారు. శుక్రవారం వేంపల్లి పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో ఆయన సర్వ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎంపిటిసిలు, సర్పంచులు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అందుకు ఎంపీటీసీ కటిక చంద్రశేఖర్, భారతితో పాతపేట, చైతన్య నగర్ , అమ్మవారి శాల వీధి, ఉషాకిరణ్ స్కూల్ వీధి తదితర ప్రాంతాలలో పాపాగ్ని నది నుంచి గత మూడేళ్ల నుంచి త్రాగునీరు రావడం లేదన్నారు. గత సమావేశంలో ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. అందుకు ఎంపీడీవో స్పందించి వారం లోపు గ్రామపంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు మెహాతాజ్, రమణమ్మ, ఎంపీటీసీలు ప్రదీప్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, సర్పంచులు లక్ష్మీపావని, జగన్నాథ్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.