విజయనగరం జిల్లాలో ఈ నెల 13న నిర్వహించబోవు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలను సజావుగా, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 31 లొకేషన్లులో 72 పోలింగు కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పోలింగు కేంద్రం వద్ద ఎస్ఐ స్ధాయి అధికారిని నియమించామని, బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులను నియమించామన్నారు.
బందోబస్తు నిమిత్తం ఒక అదనపు ఎస్పీతో సహా 5గురు డిఎస్పీలు, 20 మంది సిఐలు, 67 మంది ఎస్ఐలు, 90మంది ఎఎస్ఐలు, 222మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 552మంది కానిస్టేబుళ్ళు, 106 మహిళా కానిస్టేబుళ్ళును నియమించామన్నారు. వీరు కాకుండా, ఆర్మ్ రిజర్వు, ఎపిఎస్సీ, ఎస్టీఎఫ్ మరియు హెూంగార్డులతో సుమారు 1500మంది విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకుగాను 13రూట్ మొబైల్స్, 18 స్ట్రైకింగు ఫోర్సులను, 6 స్పెషల్ స్ట్రైకింగు ఫోర్సులను కూడా ఏర్పాటు చేసామన్నారు. పోలింగు కేంద్రాలు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సిఆర్పిసి, సెక్షన్ 30 అమలులో ఉంటున్నందున ఎవ్వరూ గుంపులుగా ఉండవద్దని, ప్రజలందరూ భద్రతా సిబ్బంది సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో చట్టంను ఎవ్వరు ఉల్లంఘించినా, కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు.