హైదరాబాదు నుంచి బెంగళూరుకు హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని, ఆ సొమ్మును దోచుకునేందుకు స్కెచ్ వేసిన ఓ ముఠా సభ్యుల్లో నలుగురిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.89 కోట్ల నగదు, రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు, 13 నెంబరు ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం వెల్లడించారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని హంపాపురం వద్ద గత నెల 23న హవాలా డబ్బు రూ.38 లక్షలను దోచుకెళ్లారు. ఆ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాదు నుంచి బెంగుళూరుకు తరలిస్తున్న హవాలా సొమ్ము రూ.1.89 కోట్లను కొల్లగొట్టేందుకు అదే ముఠా స్కెచ్ వేసినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా సరిహద్దులో దోపిడీకి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. కేరళకు చెందిన శ్రీధరన్ నేతృత్వంలో దోపిడీ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాలోని నలుగురిని , హవాలా సొమ్మును కారులో తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.