నన్ను అరెస్ట్ చేసినా సరే...నేను అన్నింటికి సిద్దంగా ఉన్నానని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన అనుచరులతో కలిసి ఆయన కడప సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. విచారణ అధికారులు లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విచారణ ఎప్పుడు అన్నది మళ్ళీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పారన్నారు.
"సీబీఐ విచారణ కోసం ఇవాళ పిలిచారు. ఆరోగ్యం సహకరించకపోయినా విచారణకు వచ్చాను. సీబీఐ అధికారులు అందుబాటులో లేరు. మరోసారి నోటీసు ఇచ్చి పిలుస్తామన్నారు. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా. నన్ను అరెస్టు చేసుకుంటే చేసుకోండి. ఈ కేసు పరిష్కారం కావాలంటే ఆ లెటర్ గురించి తెలుసుకోవాలి. ఆ లెటర్ గురించి తెలిస్తే.. అసలు విషయం బయటకు వస్తుంది. లెటర్ లేకుండా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసును పూర్తి చేయలేదు." అని వైఎస్ భాస్కర్ రెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో భాస్కరరెడ్డిని సీబీఐ ఏడాది కిందట వరసగా రెండు రోజులపాటు విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆయన్ను విచారణకు పిలిచింది. ఇక ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఈ ఏడాది మూడు సార్లు విచారించింది. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డిని ఈనెల 13 (సోమవారం) వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.