వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదని ఆ ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు పార్టీ జెండాలు ఎగురవేశారు. వైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్ చేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. గత 12 ఏళ్లుగా సీఎం జగన్ పార్టీని ఆదర్శవంతంగా నడుపుతున్నారని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్ అని కొనియాడారు.
ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పోరాడారని సజ్జల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. దేశ చరిత్రలోనే ఎవ్వరూ చెయ్యని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారన్నారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారన్నారు. మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదన్నారు.
ప్రజలకు జవాబుదారీగా వైఎస్ జగన్ ప్రభుత్వం నడుస్తోందని సజ్జల అన్నారు. సీఎం జగన్ తన అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ రోల్ మోడల్ అని వ్యాఖ్యనించారు. వైఎస్సాఆర్ పార్టీకి ఎప్పటికి ఓటమి ఉండదని..ఎంత మంది కుట్రలు చేసినా వైసీపీని ఏం చేయ్యలేరని అన్నారు.