జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని పబ్లిక్ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఆడ, మగ తేడాలేకుండా అందరూ టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించనున్నట్టు నగర అధికారులు గురువారం ప్రకటించారు. టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసినందుకు ఓ మహిళను ఈత కొలను నుంచి బయటకు గెంటేయడంతో ఆమె అంబుడ్స్‌పర్సన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. పురుషుల మాదిరిగానే టాప్‌లెస్‌గా వెళ్లేందుకు అనుమతించాలని, వారితో సమానంగా తమను చూడాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు తాజా నిబంధనలు తీసుకొచ్చారు.
బీబీసీ ప్రకారం.. వారు వివక్షకు గురయ్యారని బెర్లిన్ అధికారులు అంగీకరించారు.. బెర్లిన్ స్విమ్మింగ్‌పూల్స్‌ను సందర్శించే వారంతా టాప్‌లెస్‌గా వెళ్లడానికి అర్హులని చెప్పారు.. ఈ విషయంలో అంబుడ్స్‌మన్ జోక్యం చేసుకోవడంతో నగరంలోని పబ్లిక్ పూల్స్‌ను నడుపుతున్న బెర్లినర్ బేడర్‌బెట్రీబ్ తన దుస్తుల నిబంధనలను కూడా తదనుగుణంగా మార్చింది. ఈ నిర్ణయాన్ని అంబుడ్స్‌పర్సన్ కార్యాలయం స్వాగతించింది
‘‘అంబుడ్స్‌పర్సన్ కార్యాలయం బేడర్‌బెట్రీబ్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది, ఎందుకంటే ఇది బెర్లిన్‌వాసులందరికీ పురుషులైనా, మహిళలైనా లేదా ట్రాన్స్‌జెండర్లై అందరికీ సమాన హక్కులను కల్పిస్తోంది.. ఇది బేడర్‌బెట్రీబ్‌లోని సిబ్బందికి చట్టపరమైన ఖచ్చితత్వాన్ని కూడా సృష్టిస్తుంది’’ అని అంబుడ్స్‌పర్సన్ కార్యాలయం చీఫ్ డోరిస్ లైబ్షెర్ అన్నారు.
"ఇప్పుడు నియంత్రణ స్థిరంగా వర్తింపజేయడం ముఖ్యం.. ఇకపై బహిష్కరణలు లేదా గృహ నిషేధాలు జారీ చేయం’ అని పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు కానీ, ఈ నిర్ణయాన్ని జర్మనీ ఫ్రీకోర్పెర్కల్చర్ లేదా ఫ్రీ బాడీ కల్చర్ స్వాగతించవచ్చు. జర్మనీ లింగ బేధం లేకుండా నగ్నత్వం పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంది. అయితే, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ వద్ద దీనిని అనుమతించాలా? వద్దా? అనే సమస్య స్థానిక అధికారులను సందిగ్ధానికి గురిచేసింది.
గతేడాది నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని సీజెన్, లోవర్ సాక్సోనీలోని గాట్టింగెన్‌తో సహా అనేక నగరాలు పబ్లిక్ పూల్స్‌లో టాప్‌లెస్ స్విమ్మింగ్‌కు అనుమతించినట్టు నివేదికలు వచ్చాయి. కానీ లోవర్ సాక్సోనీ రాష్ట్ర రాజధాని హనోవర్ ఈ నిబంధనలను మార్చింది. స్విమ్మింగ్ పూల్‌లో దిగేటప్పుడు మాత్రం ప్రాథమిక లైంగిక అవయవాలను కప్పుకోవాలని నిర్దేశించింది.