విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో గేదెపై పులి దాడి చేసి హతమార్చిన విషయం సోమవారం ఉదయం వెలుగు చూసింది. మదనాపురం గ్రామంలోని నీలాటి రేపు కల్లాల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మదనాపురం గ్రామానికి చెందిన వర్రి శ్రీను అనే రైతుకు సంబంధించిన గేదెపెయ్య హతమయింది. ఎప్పటి మాదిరిగానే ఆదివారం రాత్రి రైతు వర్రి శ్రీను నీలాంటి రేవు కల్లాల వద్ద ఉన్న పశువుల శాలలో తన గేదె పెయ్యను కట్టి ఉంచారు. సోమవారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికులు కల్లుగీత పని కోసం అటువైపు వెళుతుండగా అక్కడ హతమై పడి ఉన్న గేదెపెయ్యను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ జంతువు దాడి చేసిన విధంగా హతమై ఉన్న గేదెపెయ్య చూశారు. అనుమానంతో పరిశీలించగా ఆ ప్రదేశంలో ఉన్న పాదమద్రలు పులి పాదముద్రలుగా గుర్తించారు. పులి దాడి కారణంగానే గేదెపెయ్య హతమైనట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.