ఖరీఫ్ సీజన్ ముందుంది, కానీ నేటికీ అనుకున్న పనులు జరగ లేదు. అభివృద్ధి(లైనింగ్)పనులు ముందుకు సాగలేదు. యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన లైనింగ్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఫలితంగా కోట్లాది రూపాయల జపాన్(జైకా)నిధులు మురుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 20శాతం పనులు మాత్రమే జరిగినట్లు అంచనా. ఇదీ వెంగళరాయ సాగర్ ప్రస్తుత పరిస్థితి. ప్రాజక్టునకు సంబంధించిన వివరాల్లోకి వెళితే. రైతులకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో సువర్ణముఖి నదిపై ఆనకట్టను కట్టేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా, నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 1983లో నాటి సీఎం నందమూరి తారక రామారావు ప్రారంభోత్సవం కావించారు. అయితే 40ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించడంలో విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. సుమారు 25వేల ఎకరాల ఆయకట్టుగా అధికారులు, నాయకులు చెబుతున్నప్పటికీ, నాలుగు దశాబ్దాలైనా అందులో సగం ఆయకట్టుకి కూడా సాగు నీరు అందటం లేదు.
నత్త నడకన లైనింగ్ పనులు
వెంగళరాయ ప్రాజక్టు కుడి, ఎడమ కాలువల అభివృద్ధి నిమిత్త లైనింగ్ పనులతో పాటు ప్రధాన గేట్ల ఆధునీకరణ, హెడ్ స్లూయిస్ మరమ్మతులు తదితర వాటి నిమిత్తం 63 కోట్ల రూపాయల జపాన్(జైకా)నిధులు విడుదలయ్యాయి. పై వాటితో పాటు కుడి ప్రధాన కాలువ(ఆర్ఎంసి)ఎడమ కాలువ(ఎల్ఎంసి)వాటి బ్రాంచ్ కాలువలను లైనింగ్ చేయాలి. ఆర్ఎంసి 18. 7కిలోమీటర్లు, ఎల్ఎంసి రెండు వందల మీటర్లు, అలాగే ఎల్ఎంసి బ్రాంచ్ కెనాల్ 10, ఆర్ఎంసి-సుమరు 7. 7కిలోమీటర్ల పాటు లైనింగ్ చేయాల్సి ఉంది. అయితే నేటి వరకు కేవలం 20శాతం మాత్రమే పనులు జరిగినట్లు అంచన. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఇప్పట్లో లైనింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. అంతేకాకుండా గోముఖి నదిపై అక్విడెక్ట్ అభివృద్ధి పనులను జరిపించాల్సి ఉండగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, మక్కువ జడ్పిటిసి మావుడి శ్రీనివాస నాయుడుల చొరవతో ప్రతిపాదనలు పంపించడం, ఆ మేరకు పనులు మంజూరు కావటం జరిగింది. అయినప్పటికీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేయాల్సిఉంది. లేదంటే రానున్న ఖరీఫ్ నాటికి ఆయకట్టు భూములకు సాగునీరు అందే అవకాశం ఉండదు.
చేపల చెరువులతో సమస్య
ఇది ఇలా ఉండగా రిజర్వాయర్ ఆయకట్టు మొదటి భాగంలో రైతులు విస్తారంగా చేపల చెరువులను పెంచడం సమస్యగా మారింది. రిజర్వాయర్ నీటిని చేపల చెరువులకు మళ్లించకూడదన్న నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు తమ భూములను చేపల చెరువులుగా మార్పు చేసి సాగు నిమిత్తం వాడాల్సిన రిజర్వాయర్ నీటిని యదేచ్చగా మళ్ళిస్తుంటే అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వలన విమర్శలకు గురవుతున్నారు. వెంగళ రాయనీరు మక్కువ మండలం మీదుగా బొబ్బిలి, సీతానగరం మండలాలు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే అధిక సంఖ్యలో తయారైన చేపల చెరువుల కారణంగా టైలెండ్ భూములకు నీరు అందటం లేదు. అంతే కాకుండా సాగు నీరు కలుషితం అవుతున్నది. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ తగిన చర్యలు చేపట్టకపోవడం, తోటి రైతులను మిగిలిన వారు మందలించకపోవడం సమస్యగా ఉంది. కావున ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే కొంతమేరకు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది.
ఎత్తిపోతల పథకం ఎప్పుడో
ఇది ఇలా ఉండగా సాలూరు రైతులకు వెంగళరాయ రిజర్వాయర్ నీరు అందటం అనేది కలగా మిగులుతుంది. రిజర్వాయర్ నిర్మించిన నాటినుండి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి ఎర్ర చెఱువునకు నీరు అందించి తద్వారా మండలంలోని భూములకు సాగునీటిని అందించాలని బాగు వలస ప్రాంత రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పిన చోట లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే పెదపదం, బాగువలస, పురోహితుని వలస, మీదుగా బోరబంద వరకు ఉన్న వందలాది ఎకరాలకు సాగు నీరంది భూములు సస్యశ్యామలమవుతాయి. అయితే రిజర్వాయర్లపై ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయటం కుదరదని మొదట్లో చెప్పిన నాయకులు, అధికారులు ఇటీవల తమ మాటలను సడలించారు. ఇరిగేషన్ మంత్రితో పాటు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి వెంగళరాయ రిజర్వాయర్ పై ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయిస్తామని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో బాగువలస విచ్చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర దృష్టిలో పలుమార్లు పెట్టారు. కావున ఇప్పటికైనా తమ కోరిక తీరుతుందని సాలూరు మండలం తూర్పు భాగం రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరి కోరిక నెరవేరితే మండల రైతులు పాలకులకు కృతజ్ఞులై ఉంటారని కచ్చితంగా చెప్పొచ్చు.