మీ సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తానని ముస్లిం మత పెద్దలకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముస్లింలకు తమ ప్రభుత్వంలో ఇచ్చినన్ని పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని ఆయన అన్నారు. ముస్లింలకు సంబంధించిన అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సోమవారం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇది మనందరి ప్రభుత్వమనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలని ముస్లిం సంఘాల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్న దానిపై సలహాలు తీసుకోవడానికే ఇవాళ ముస్లిం సంఘాలను పిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వారు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈసారి తమ లక్ష్యం 175 కి 175 స్థానాలు గెలవడమేనని సీఎం జగన్ తెలిపారు. ఈసారి కచ్చితంగా దాన్ని సాధిస్తామని పేర్కొన్నారు.