మంగళగిరి నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్ లో ఓపీడీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ ముఖేష్ త్రిపాఠీ అన్నారు. మంగళగిరిలో పేషెంట్ కేర్ జర్నీ నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఎయిమ్స్ ఆడిటోరియంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ & సీఈవో ముఖేష్ త్రిపాఠీ పురోగతిని వివరించారు. 12 మార్చి 2019 నుండి ఇప్పటి వరకు ఎయిమ్స్ లో పేషెంట్ కేర్ వివరాలను వెల్లడిస్తూ మార్చి 12 2019 నాడు రోజుకు ఔట్ పేషెంట్ల సంఖ్య 44 ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 2, 400-2, 500 మంది రోగులకు పెరిగిందని చెప్పారు.
11-03-2023 వరకు మొత్తం 9, 67, 192 మంది రోగులు ఔట్ పేషెంట్ సేవలను పొందారని చెప్పారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో, ఇన్‌పేషెంట్ సేవలు (ప్రస్తుతం 555 పడకలు), ఐసీయూ సేవలు, ఓటీ సేవలు ( ప్రస్తుతం 06 ఓటీ లు) & ట్రామా మరియు అత్యవసర సేవలు పని చేస్తున్నాయని వివరించారు. 256 స్లైస్ సిటి, 3టి ఎంఆర్‌ఐ, హై ఎనర్జీ లినాక్, లో ఎనర్జీ లినాక్, హై డోస్ బ్రాకీథెరపీ, 128 స్లైస్ సిటి సిమ్యులేటర్, ఆర్‌టిఎంఎస్ & పిఇటి సిటి సౌకర్యాలు వంటి అన్ని అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్‌లు అందుబాటులోకి తెచ్చామని, వారికి అధునాతన క్యాన్సర్ కేర్ అందిస్తున్నామని ఆయన తెలిపారు.
త్వరలోనే కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన సేవలను అందించే ఆదేశాన్ని ఇన్‌స్టిట్యూట్ నెరవేరుస్తోందని, ఈ దిశగా ఇన్‌స్టిట్యూట్‌లో పీఎం జేఏవై, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఓపీడీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా అమలు చేయబడినట్లు తెలిపారు.
మెడికల్ సూపరింటెండెంట్ ఇన్‌స్టిట్యూట్‌లోని అన్ని విభాగాలలో అందుబాటులో ఉన్న రోగుల సంరక్షణ సేవల గురించి క్లుప్త వివరణ ఇచ్చారు. అధునాతన కంటిశుక్లం & రెటీనా సర్జరీలు, లాపరోస్కోపిక్ సర్జరీలు వంటి వివిధ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌లో హిప్ & మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, ఆర్థ్రోస్కోపీ సర్జరీలు క్రమం తప్పకుండా జరుగుతాయని అన్నారు.
తర్వాత కొంతమంది రోగులు ఇన్‌స్టిట్యూట్‌లో తాము పొందిన సేవల గురించి అనుభవాలు & అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సంస్థతో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ప్రముఖులకు జ్ఞాపికను అందజేశారు. నాలుగు సంవత్సరాల రోగుల సంరక్షణ ప్రయాణం మరియు సాధించిన వివిధ మైలురాళ్ల చిత్రమైన ప్రాతినిధ్యంపై బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ అకడమిక్ డీన్ డాక్టర్ జాయ్ ఏ గోషల్, డాక్టర్ శ్రీమంతకుమార్ డాష్, డాక్టర్ దీప్తి వేపకొమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ థామస్ అబ్రహం, మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ శంకరన్ & మీడియా సెల్ ప్రతినిధి డాక్టర్ కె. వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.