కాకినాడ సాగరతీరం లో విదేశీ అతిథుల సందడి నెలకొంది. మెట్టినిళ్లు హిందూ మహాసముద్రం నుండి బంగాళాఖాతం పుట్టినింటికి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో వేలాదిగా తరలివచ్చే ఈ అతిథులు, ఇక్కడి ఇసుక తెన్నుల్లో గుడ్లు పెట్టి, తమ సంతతిని వృద్ది చేసుకుంటాయి. పుట్టింటికి వచ్చిన ఈ అపురూప అతిథుల ను కంటికి రెప్పలా చూసుకొని, వాటి సంతతిని కాపాడటానికి మత్స్యకారులు, అటవీశాఖ అధికార్లు సన్నాహాలు చేసారు. సముద్రజలాల కాలుష్యాన్ని కాపాడే ఎకో ఫ్రెండ్లీ అలీవ్ రీడ్లే తాబేళ్ల బయోడవర్శిటీ కి కాకినాడ హోప్ ఐ లాండ్ వేదిక అయింది.
బంగాళాఖాతం లక్షలాది జీవరాశులకు ఆవాసం. ఈ సముద్ర జలాల్లో వృక్షసంపద, మత్ససంపద అపారం. ఈ సాగర గర్భంలో జీవావరణ సమతుల్యత కాపాడుకోవడానికి ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయి. సముద్రజలాల్లోని కాలుష్యం వలన జీవసంపద నాశనం కాకుండా ఉండేందుకు ఎన్నో జీవులు కృషి చేస్తుంటాయి. వీటిల్లో ఒకటి ఆలీవ్ రీడ్లే తాబేళు. వందల సంవత్సరాలు బ్రతికే ఈ జీవి సముద్రజలాలను శుద్ది చేసి, సమతుల్యతను కాపాడే రక్షణ సిపాయిలు ఇవి.
కాకినాడ సాగర తీరానికి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ హోఐలాండ్ దీవి. ప్రకృతి వైపరీత్యాల నుండి కాకినాడ నగరాన్ని ఈ దీవీ కాపాడుతూ రక్షణగా ఉంది. అలాంటి ఈ దీవి గత కొంత కాలంగా ఆలీవ్ రిడ్లే తాబేళ్ళకు ఆతిధ్యం ఇస్తుంది. తమ సంతానోత్పత్తి కోసం ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆలీవ్ రిడ్లే తాబేళ్ళు ఇక్కడకు పెద్ద ఎత్తున వలస వస్తుంటాయి. ఈ తాబేళ్ల ప్రాధాన్యత తెలిసిన అధికార్లు, మత్స్యకార్లు హోప్ ఐలాండ్ దీవిలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఈ తాబేళ్ళు పొదిగిన గుడ్లను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారు. అంతే కాదు పుట్టిన తాబేళ్ల పిల్లలను కొంత కాలం ఎదగనిచ్చి వాటిని సముద్రంలో వదిలి వేస్తుంటారు.
గత ఏడాది హోఐలాండ్ కు 188 తాబేళ్ళు రాగా ఈ ఏడాది 288 తాబేళ్ళు వచ్చి గుడ్లను పొదిగినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క ఏడాది కాలంలోనే తాబేళ్ళ వలస పెరగడానికి ఒక కారణం ఉంది. పడవలకు, వలలకు చిక్కి తాబేళ్లు మృత్యవాత పడకుండా ఉండటానికి హోప్ ఐలాండ్ వద్ద ఈ మూడు నెలలు నిషేదజ్ఞలు ఉన్నాయి. తాబేళ్ళు వలస వచ్చి గుడ్లు పొదిగే ప్రాంతాల్లో నౌకలు, బోట్లు, పడవలు తిరగకుండా చర్యలు తీసుకుంటారు. దీంతో ఇక్కడ రక్షణగా ఉందని గుర్తించిన ఈ సముద్ర జీవులు ఇక్కడ క్రమంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.