ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ చేసిన ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. గవర్నర్ ప్రసంగంలో మాత్రం దాన్ని ఎందుకు పెట్టించలేకపోయారని ఆయన నిలదీశారు.
ఈ మేరకు మంగళవారం అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడించడమేంటని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రానికి పెద్ద గవర్నరా? ముఖ్యమంత్రా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన గవర్నర్‌తో సీఎంను పొడిగించి, ఆయన స్థాయిని తగ్గించారని ఆక్షేపించారు. అలాగే, శాంతిభద్రతల అంశం ప్రసంగంలో ఎక్కడా లేదన్నారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ వేచి ఉండేలా చేశారని.. ఇది సభా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన గవర్నర్‌తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో రంగులు, పేర్ల పిచ్చి తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. గవర్నర్‌తో అసత్యాలు పలికించారని ఫైరయ్యారు. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారడీయేనని ఆరోపించారు. ఏపీ విభజన చట్టానికి 10 ఏళ్ల కాలపరిమితి ముగుస్తున్నా.. గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదని విమర్శించారు. వాస్తవాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం కొనసాగిందని.. అసత్యాలు చదవలేక ఆయన ఇబ్బందిపడ్డారని తెలిపారు. అలాగే, ప్రసంగంలో అమరావతి, పోలవరం ప్రస్తావనే లేదని ఎమ్మెల్యేలు విమర్శించారు.