కోడికత్తి కేసు వేగంపుంజుకొంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ‘కోడికత్తి దాడి’ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. కోడికత్తి దాడి కేసులో విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు సీఎం జగన్ హాజరు కావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసుకు సంబంధించి కోడి కత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
గత వారం కూడా ఇదే కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టింది. సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయనే కావడంతో విచారించారు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. కోడికత్తితో పాటు పర్స్, బెల్ట్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని దినేష్ కుమార్ వివరించారు. వీటిని చూపించమని న్యాయమూర్తి అడిగినప్పుడు తీసుకురాలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరం జరిగిన తర్వాత సీజ్ చేసిన వస్తువులను కోర్టు అడిగినప్పుడు చూపించాలి కదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో సీజ్ చేసిన వస్తువులను కోర్టుకు చూపించాలని ఆదేశించారు.