పర్యాటక రంగానికి రాష్ట్రాలు పరిశ్రమ హోదా కల్పిస్తే అది మరింతగా రాణిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం వైయస్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. పరిశ్రమ హోదా పొందడం ద్వారా పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలు ఇతర పరిశ్రమలతో సమానంగా విద్యుత్ చార్జీలు, ఇతర పన్నుల వంటి ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పర్యాటక రంగం వాణిజ్యం కేటగిరిలో ఉన్నందున అధిక రేట్లను చెల్లించాల్సి వస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పిస్తే భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఆతిధ్య రంగంలో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహకారిగా మారుతుందని అన్నారు.