గిగ్ ఆర్థిక వ్యవస్థలో పనిచేసే వర్కర్ల (తాత్కాలిక కార్మికులు) సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు. గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేస్తున్నతాత్కాలిక కార్మికలకు కనీస వేతన విధానం అమలుపై రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేస్తున్న శ్రామికులు అందరూ కనీస వేతనం పొందడానికి అర్హులుగా చేస్తూ ప్రభుత్వం 2019లో వేతన కోడ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం ప్రతి కార్మికుడికి వారు చేసే పని కాల వ్యవధికి అనుగుణంగా కనీస వేతనాలను యాజమాన్యం నిర్ణయించాలి. కార్మికుడు పని చేసే వ్యవధి, గంట, దినసరి, నెలసరి అయినప్పటికీ వేజ్ కోడ్ కింద అతను కనీస వేతనం పొందడానికి అర్హుడని మంత్రి వెల్లడించారు.