అనంతపురం జిల్లా పరిధిలోని యల్లనూరు మండల పరిధిలోని వెంకటాంపల్లి గ్రామ సమీపంలోని పులివెందుల బ్రాంచి కాలువలో (పీబీసీ) పడి కడప జిల్లా సింహాద్రిపురం మండలం గురజాల గ్రామానికి చెందిన కమలమ్మ (45), ఆమె కూతురు శ్యామల (20) మృతిచెందారు. కమలమ్మ కుమారుడు భువనేశ్వర్ రెడ్డి.. వారిద్దనీ తమ చీనీ తోట వద్దకు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బైక్‌పై వదిలివెళ్లాడు. తోట పక్కనే ఉన్న కాలువలో బట్టలు ఉతుక్కుంటామని, కాసేపటి తరువాత రావాలని భువనేశ్వర్‌కు చెప్పి పంపించారు. ప్రమాదవశాత్తు కాలువలోపడి మృతిచెంది ఉంటారని స్థానికులు అంటున్నారు. కాలువ వద్ద చెప్పులు, బట్టలు ఉండడంతో అటుగా వెళుతున్న వారు అనుమానించి యల్లనూరు, సింహాద్రిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కాలువలో గాలించగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కమలమ్మ భర్త గోపాల్‌రెడ్డి గతంలో మరణించారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురుకు వివాహమైంది. కుమారుడు వ్యవసాయం చేస్తున్నాడు. రెండో కూతురు శ్యామల సింహాద్రిపురం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహించేవారు. తల్లి, సోదరి మృతితో భువనేశ్వర్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. సింహాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.