ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. ఆయన నివాసాన్ని ఆదివారం ఉదయాన్నే భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు కూడా వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసనలు చేశారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కనిపించింది. అయితే తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్తత చల్లబడింది.
‘మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురువుతున్నట్టు నేను వింటున్నాను’ అని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయనకు ఢిల్లీ పోలీసులు మార్చి 16న నోటీసులు జారీచేశారు. ఇందులో భాగంగానే రాహుల్ నివాసానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు వారు చెప్పారు.
ఈ పోలీసు బృందానికి ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నాయకత్వం వహించారు. రాహుల్ గాంధీ నివాసం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ జోడో యాత్రలో తనను పలువురు మహిళలు కలిశారని, తమపై అత్యాచారాలు జరిగాయని చెప్పారని రాహుల్ గాంధీ జనవరి 30న కశ్మీర్ లో జరిగిన సభలో చెప్పారు. ఆ బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు.. వారి వివరాలను మాకు ఇవ్వాలని ఆయనను కోరేందుకు వచ్చాం’’ అని వివరించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ‘‘లక్షలాది మంది మహిళలు స్వేచ్ఛగా నడవడానికి, వారి ఆందోళనలను వినిపించడానికి, వారి బాధలను పంచుకోవడానికి సురక్షితమైన వేదికను భారత్ జోడో యాత్ర కల్పించింది. ఢిల్లీ పోలీసుల చవకబారు నాటకాలు చూస్తే.. అదానీపై మేం అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎంతగా గడగడలాడుతున్నారో తెలుస్తోంది. సమాధానాలు తెలుసుకోవాలనే మా దృఢ విశ్వాసాన్ని ఈ వేధింపులు మరింతగా పెంచుతాయి’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అయితే పోలీసులు మధ్యాహ్నానికి తిరిగి వెళ్లిపోయారు. రాహుల్ నుంచి సమాచారం తీసుకుంటామని చెప్పి.. కొన్ని గంటల తర్వాత అలాంటిదేమీ లేకుండానే వెళ్లిపోయారు. ఈరోజు రాహుల్‌ను ప్రశ్నించలేమని, తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు.
‘‘అది సుదీర్ఘ యాత్ర అని, తాను చాలా మందిని కలిశానని, గుర్తుచేసుకోవడానికి సమయం కావాలని రాహుల్ గాంధీ కోరారు. త్వరలో సమాచారం ఇస్తానని చెప్పారు. మాకు సమాచారం అందిన వెంటనే చర్యలు ప్రారంభిస్తాం’’ అని స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే రాహుల్ తన నివాసం నుంచి బయటికి వెళ్లిపోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa