అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు ప్రస్తుతం గడ్డుకాలం వచ్చింది. అమెరికాలోని టెక్ రంగంలో తొలగింపులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న అనేక మంది తమ కొలువులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉద్యోగం పోయిన 60 రోజుల్లో కొత్త ఉద్యోగం పొందాలన్న వీసా నిబంధన వారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ హెచ్-1బీ వీసాదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ పరిణామాలు హెచ్-1బీ వీసాదారుల కుటుంబాల మీద పడుతున్నాయి. ఉద్యోగవీసాపై అనేక మంది భారతీయులు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వారి సంతానం కూడా అక్కడే జన్మించడంతో హెచ్-1బీ వీసాదారుల పరిస్థితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. తొలంగిపుల పర్వం తొలినాళ్లల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
ప్రస్తుత పరిస్థితులు భారీ మానవ సంక్షోభాన్ని తలపిస్తున్నాయంటూ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా శుక్రవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. హెచ్-1బీ వీసాకు సంబంధించి 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని అధ్యక్ష ఉప సలహా సంఘం ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గ్రేస్ పీరియడ్ పెంపుతో హెచ్-1బీ వీసాదారులకు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు తగినంత సమయం చిక్కుతుందని పేర్కొంది. గడువు పొడిగింపును తక్షణమే అమలులోకి తేవాలని అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగానికి అధ్యక్ష ఉప సంఘం సూచించినా దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. గత ఏడాది అక్టోబర్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రయోజనం ఉండదని ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెటా లాంటి సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తుండటంతో భవిష్యత్తులో మరింత మంది హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.