సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్ విధానాలను నిరసిస్తూ దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా సోమవారం రన్నింగ్ స్టాఫ్, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రమాదాల నివారణ పేరుతో భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడనీయకుండా నిర్బంధం విధించడం, రోజుకో కొత్త నిబంధనతో ఇబ్బందులు పెట్టడం సరికాదని మండిపడ్డారు. జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్‌లో వేలాదిమంది రైల్వే రన్నింగ్ స్టాఫ్, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. రన్నింగ్ స్టాఫ్‌లో ప్రధానమైన లోకో పైలట్లపై రోజుకో సర్క్యులర్, ఆర్డర్ జారీ చేస్తుండడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల వారి ఫోన్లను కూడా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం విమర్శలకు కారణమైంది. రోజుల తరబడి కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడంతో వారి యోగక్షేమాలు తెలియడం లేదని, వారి నుంచి అత్యవసర సమాచారం సైతం తమకు చేరడం లేదని రన్నింగ్ స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 3, 4వ తేదీల్లో ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్) నేతృత్వంలో జోథ్‌పూర్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రన్నింగ్ స్టాఫ్ కుటుంబసభ్యులతో సహా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సోమవారం రన్నింగ్ స్టాఫ్ వారి కుటుంబసభ్యులతో కలిసి భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, నడికుడి, సనత్‌నగర్, సికింద్రాబాద్, కాజీపేట, గుంతకల్, రేణిగుంట, తిరుపతి, నందలూరు, కాచిగూడ తదితర ప్రాంతాలలో రన్నింగ్ స్టాఫ్ లాబీల ముందు పెద్దఎత్తున నిరసన తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa