చిత్తూరు పోలీసులు హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీస్ వారి వివరాల ప్రకారం.. నగరంలోని శివారు ప్రాంతమైన ప్రశాంత్‌నగర్‌కు చెందిన శివకుమార్(21) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి చిత్తూరు నగరం చామంతిపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ శివ, తోటపాళ్యంకు చెందిన మెకానిక్ రాజ్‌కుమార్ అనే స్నేహితులున్నారు. తన భార్యతో శివకుమార్‌కు వివాహేతర సంబంధం ఉందని భావించిన శివ.. ఈ విషయాన్ని రాజ్‌కుమార్‌కు చెప్పారు. వీరిద్దరూ కలిసి శివకుమార్‌కు బుద్ధి చెప్పాలని భావించారు. ఈనెల 19వ తేదీన ముగ్గురూ కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద మద్యం తాగారు. రాత్రి 11 గంటల సమయంలో శివ, రాజ్‌కుమార్ కలిసి శివకుమార్‌పై రాళ్లతో దాడిచేశారు. రక్తపు మడుగులో కుప్పకూలిన శివకుమార్‌ను అక్కడే వదిలి పారిపోయారు. మరుసటిరోజు ఉదయం 6 గంటల సమయంలో రక్తపు మడుగులో పడున్న ఇతడిని కొందరు గుర్తించారు. కుటుంబ సభ్యులు వేలూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చెన్నై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదుచేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న శివకుమార్ ఈనెల 23వ తేదీన చనిపోవడంతో హత్యకేసుగా నమోదుచేశారు. కట్టమంచి వద్ద వున్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. నిందితులు శివ, రాజ్‌కుమార్‌తో కలిసి శివకుమార్ ఉన్నట్లు తేలింది. పోలీసులు తమ విచారణలో వేగం పెంచడంతో హత్య విషయం వెలుగుచూసింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.