తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త డాక్టర్ కమ్మిలి శ్రీధర్ 2017లో తన వద్ద తీసుకున్న రూ. 12లక్షలు తనకు ఇప్పించాలని, తనపై వారు పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని గూడూరుకు చెందిన రమణయ్య నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.... డాక్టర్ శ్రీధర్‌కు పద్మశ్రీ అవార్డు ఇప్పించేందుకుగాను కోటిన్నర అవుతుందని చెప్పి గుంటూరుకు చెందిన ఇద్దరు అడ్వాన్స్ కింద 2017లో జనవరి 29న రూ.52 లక్షలు అతని నుంచి తీసుకున్నారని, అవార్డు ఇప్పించకుండా మోసం చేశారన్నారు. వారిని శ్రీధర్ దంపతులకు తానే పరిచయం చేశానన్నారు. అది మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా తన వద్ద శ్రీదేవి దంపతులు ఒకసారి రూ. 10లక్షలు, మరోసారి రూ.2లక్షలు చేబదులుగా తీసుకున్నారన్నారు. తిరిగి చెల్లించకుండా తనపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.