తాను ఏ తప్పు చేయలేదని అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఫేక్ సర్టిఫికేట్‌కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై తమ్మినేని సీతారాం తాజాగా స్పందించారు. ఈ ఆరోపణలపై తగిన సమయంలో సమాధానమిస్తానని స్పష్టం చేశారు. తనపై గవర్నర్‌కు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేస్తామంటున్న వారికి ఆ హక్కు ఉందని అన్నారు. వారు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, అయితే తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని తాను ఎందుకు ఆందోళన చెందుతానని ప్రశ్నించారు.
తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్‌తో తమ్మినేని సీతారం న్యాయవిద్యకు సంబంధించి మూడేళ్ల కోర్సులో చేరినట్టు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ పదవిలో ఉండి కూడా తప్పుడు సర్టిఫికేట్ సమర్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సీతారాం ఈ ఆరోపణలపై స్పందించారు.