నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన కేంద్రం దేశంలోని వివిధ ఫార్మా కంపెనీలపై ఉక్కు పాదం మోపింది. కేంద్రం అధీనంలోని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దేశవ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీల్లో తనిఖీలు చేపట్టింది. 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో తనిఖీలు జరిపింది. ఈ నేపథ్యంలో, 18 ఫార్మా కంపెనీలను లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 26 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయా సంస్థలు నకిలీ మందులు తయారుచేస్తున్నట్టు గుర్తించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో 70 ఫార్మా కంపెనీలు, ఉత్తరాఖండ్ లో 45, మధ్యప్రదేశ్ లో 23 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. భారత్ కు చెందిన పలు ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్న ఔషధాలు విదేశాల్లో మరణాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత ఫిబ్రవరిలో అహ్మదాబాద్ కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ 55 వేల ఔషధ బాటిళ్లను అమెరికా మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. భారత్ కు చెందిన ఓ సంస్థ తయారుచేసిన దగ్గుమందు గాంబియా, ఉజ్బెకిస్థాన్ లో చిన్నారుల మరణాలకు దారితీసినట్టు ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ సంస్థ అమెరికా మార్కెట్ నుంచి తన కంటి చుక్కల మందును వెనక్కి రప్పించింది. ఆ చుక్కల మందు వేసుకుంటే కంటి చూపు పోతోందన్న ఆరోపణలు వినిపించాయి.
అటు, పలు ఈ-ఫార్మసీ సంస్థలపైనా కేంద్రం కన్నేసింది. నెట్ మెడ్స్, టాటా 1ఎంజీ, ఫార్మ్ ఈజీ వంటి ఈ-ఫార్మసీ సంస్థలకు డీసీజీఐ గత నెలలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940ని ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు డీసీజీఐ భావిస్తోంది.