ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మాతృమూర్తికి ప్రసవ సమయంలో సరైన వైద్యం అందకపోవడంతో పసికందు మరణించింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని పెద్ద దోర్నాలలో మంగళవారం చోటుచేసుకుంది. తోటి ప్రయాణికుల కథనం మేరకు త్రిపురాంతకానికి చెందిన వి. సాలమ్మ గత కొంతకాలంగా పుట్టింట్లో ఉంటున్నారు. దీంతో కర్నూలు జిల్లా నున్నారు ఉంటున్న భర్త త్రిపురాంతకం వచ్చి తక్షణం ఇంటికి బయలుదేరి రావాల్సిందిగా గట్టిగా చెప్పి వెళ్లిపోయారు.
ఆందోళనకు గురైన ఆమె మంగళవారం తన ఇద్దరు పిల్లలతో అత్తారింటికి వెళ్లేందుకు మధురవాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎక్కారు. నిండు గర్భిణి కావడంతో బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులొచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. తోటి ప్రయాణి కులు ఆమెకు సపర్యలు చేయగా, మగబిడ్డకు జన్మనిచ్చింది. పసికందులో కదలికలు లేక పోవడంతో వెంటనే తల్లీబిడ్డలను ఆటోలో పెద్దదోర్నాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి బిడ్డ మరణించినట్లు చెప్పారు. నవ మాసాలు మోసి కన్న బిడ్డ మృతి చెందడంతో ఆ మాతృమూర్తి కన్నీరుమున్నీరయ్యారు.