విజయవాడ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. చిన్న చిన్న విషయాలకు వీధిన పడి కొట్టుకుంటున్న రాష్ట్ర నేతలు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు పెట్టి బాధిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధి, ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండించకపోవడం దుర్మార్గమని అన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరూ మాట్లాడరెందుకని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడరని.. నోరువిప్పరని అసహనం వ్యక్తం చేశారు. 2018లో చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తే రాహుల్‌గాంధీ సంఘీభావం తెలిపారని.. 2019లో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన్ను కించపరచొద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారని కేవీపీ గుర్తు చేశారు. నేడు రాహుల్‌కు అన్యాయం జరిగితే ఏపీ నుంచి అడిగేవారే లేకపోయారని వాపోయారు.