సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యెమెన్ సరిహద్దులోని నైరుతి ఆసిర్ ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 20 మంది హజ్ యాత్రికులు సజీవదహనమయ్యారు. మరో 29 మంది వరకూ గాయపడ్డారు. హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేక్‌లు ఫెయిలవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 21 మంది మృతిచెందగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంతో పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా హజ్ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు వెళ్తుంటారు. కుటుంబాలు, స్నేహితులతో కలిసి మక్కాను దర్శించుకుంటారు. గతవారం రంజాన్ నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి వారంలోనే ఈ ప్రమాదం జరగడం బాధాకరం. బాధితుల్లో చాలా మంది బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందినవారుగా భావిస్తున్నారు. హజ్ యాత్రను నిర్వహించే ఏషియన్స్ ద్వారా వీళ్లు మక్కాకు వెళ్లినట్టు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. హజ్ యాత్రికుల బస్సు ఖమిస్ ముషైత్ నుంచి మక్కాకు వెళ్తుండగా.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు మహెయిల్ కనుమ సమీపంలో బ్రేక్‌లు ఫెయిలై వంతెనను ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సౌదీ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.