వడదెబ్బతో మృతి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి యూనివర్సిటీ భారీ పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బాధిత కుటుంబం కోర్టులో దావా వేసింది. దీంతో 14 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ.110 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది అమెరికాలోని కెంటకీ యూనివర్సిటీ. వివరాల్లోకి వెళ్తే... కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి హీట్ ఇల్‌నెస్ ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న గ్రాంట్ బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు.. అలసిపోయి అస్వస్థతకు గురయ్యాడు.
విపరీతంగా దాహం వేయడంతో తాగడానికి నీళ్లు ఇవ్వమని అక్కడున్నవారిని బ్రేస్ అభ్యర్థించాడు. అయితే, అందుకు నిరాకరించిన కోచ్‌లు.. శిక్షణలో భాగం అంటూ ఇంకెవరూ అతడికి నీటిని ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్ సొమ్మసిల్లి పడిపోయిన అతడు కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. తన కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. పరిస్థితి విషమిస్తున్నా కోచ్‌లు పట్టించుకోకుండా తమ కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే చనిపోయాడని ఆరోపించారు. దాహం తీర్చుకోడానికి నీళ్లు అడిగినా ఎవ్వర్నీ ఇవ్వకుండా అడ్డుకున్నారని వాపోయారు.
తమ కుమారుడి మరణానికి వారిని బాధ్యులను చేస్తూ పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని బ్రాస్ కుటుంబసభ్యులు కోరారు. దీంతో బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు పరిహారం కింద చెల్లించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ముందుకొచ్చింది.‘అధిక ఎండలు, వడదెబ్బ సంబంధిత గాయాలపై అవగాహన కలిగించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి బ్రేస్ అంగీకరించాడు.. దురదృష్టవశాత్తూ బ్రేస్ అకాల మరణానికి చింతిస్తున్నాం.. అతడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని నిర్ణయించాం.. న్యాయపరంగా ఈ కేసు పరిష్కారంతో వారికి శాంతి, స్వస్థత చేకూరుతుందని ఆశిస్తున్నాం’ అని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు సెషన్‌లో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది.