కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్ర నేత కుమారస్వామి ఓటర్లకు హామీలను గుప్పించారు. జేడీఎస్ అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్లను సగం ధరకే అందిస్తామని చెప్పారు. ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని... కానీ, మహిళలకు షాక్ ఇస్తూ గ్యాస్ ధరను పూర్తిగా పెంచేశారని విమర్శించారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1000 దాటిందని చెప్పారు. ఇంత ధరను భరించడం సామాన్యులకు భారంగా పరిణమించిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని చెప్పారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటున్న అంగన్ వాడీ వర్కర్ల కోరికను కూడా తీరుస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కర్ణాటక అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను వెలువరించనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.