మనం చేసే చిన్నచిన్న తప్పులే ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలాంటి చిన్న తప్పువల్ల విజయవాడలో దారుణం జరిగింది. చిన్న నిర్లక్ష్యం ఎనిమిది నెలల పాప ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పటి వరకు చిరు నవ్వులతో కనిపించిన బిడ్డ ఇక లేదన్న వార్త తెలిసి తల్లి మనసుల తల్లడిల్లింది. నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న లంబాడి పేటకు చెందిన ప్రేమ్‌కుమార్, ఆదిమల్ల ప్రణితి భార్యభర్తలు. వీరికి ఎనిమిద నెలల పాప ఉంది. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ప్రణితి ఇంట్లోనే ఉంటుంది.
ఈ నెల 27న భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా.. ప్రణతి, పాప ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో పాపకు స్నానం చేయించేందుకు ప్రణతి.. మంచం పక్కనే ప్లాస్టిక్ బకెట్‌లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టింది.. ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇంతలో పెద్దగా పాప ఏడుపు వినిపించింది.. భయంతో ఆమె బయటకు వచ్చి చూసింది. చిన్నారి వేడినీటి బకెట్‌లో తల కిందులుగా పడి ఉండటాన్ని గమనించింది. ప్రణతి పాపను వేడినీటిలో నుంచి బయటకు తీసింది.
అప్పటికే చిన్నారి ముఖం, పొట్ట, రెండు చేతులు, వీపు కాలిపోయింది. వెంటనే పాపను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ప్రమాదంలో బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో భార్యాభర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు. అందుకే హీటర్లు ఉపయోగించే విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉండేవాళ్లు హీటర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.