ఏపీ ప్రభుత్వం. ఇటీవల గ్రామదేవత జాతర ఘటనలో చనిపోయిన రాము కుటుంబాన్ని తొండంగిలో మంత్రి రాజా, కలెక్టర్ కృతికా శుక్లాలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రెండెకరాల భూమి పట్టా, ఇంటి స్థలం, 10 లక్షల ఆర్థిక సాయం.. అలాగే మృతుని తల్లికి పింఛను, ఉద్యోగానికి సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. ఈ ఘటనలో గాయాలపాలైన శృంగవృక్షంకు చెందిన ఏడుగురికి రూ.50 వేల చొప్పున అందించారు మంత్రి. వీటితో పాటు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందిస్తామన్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేస్తున్నామన్నారు మంత్రి రాజా. నిందితులను వదిలే ప్రసక్తి లేదన్నారు.
మరోవైపు శృంగవృక్షం అమ్మవారి జాతరలో ప్రాణాలు కోల్పోయిన రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తొండంగిలో మృతుడి కుటుంబాన్ని, శృంగవృక్షంలో క్షతగాత్రులను యనమల కృష్ణుడితో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల నుంచి సోదరభావంతో కలసిమెలిసి ఉండే తుని నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. మృతుడు రాము కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
మరోవైపు శృంగవృక్షం వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు పిలుపు ఇవ్వగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాము కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన 14 మంది ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను రాజమండ్రిలోనే ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ విషయం తెలియడంతో ఎంపీ జీవీ హర్షకుమార్ అక్రమ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు వెళ్లి మాల మహానాడు నాయకులను పరామర్శించారు.
ఇటు శృంగవృక్షం వెళ్లేందుకు రాష్ట్రంలోని వివిధ దళిత సంఘాల నాయకులు, మాల మహాసభ పిలుపు ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ముందస్తు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో శృంగవృక్షంకు ఎలాంటి అనుమతులు లేవని..బయటి వారిని ఈ గ్రామానికి రాకుండా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో జరిగిన నూకాలమ్మ జాతర సందర్భంగా చిన్న వివాదం రేగింది. జాతర సందర్భంగా ఇద్దరి మధ్య ఈ వివాదం రేగగా.. ఇరువర్గాల వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో రాము అనే యువకుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రాముది తొండంగి కాగా.. జాతర ఉందని తమ అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. అతను డిగ్రీ చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 13 మందిపై కేసు నమోదు చేశారు.