ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుడి బుద్దిచెడింది.. సర్జరీల కోసం లంచం డిమాండ్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 07:31 PM

న్యూ ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్.. బెడ్ల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ దావఖానాలో చికిత్స కోసం నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అలాంటి హాస్పిటల్‌లో న్యూరోసర్జన్‌గా పని చేసే డాక్టర్ మనీశ్ రావత్ అనే పెద్ద డాక్టర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎందుకో తెలుసా..? పేషెంట్లకు త్వరగా చికిత్స అందిచడానికి, శస్త్రచికిత్సలు చేయడానికి లంచం తీసుకున్నారని.. సర్జరీ పరికరాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో బిల్లింగ్ వేశారనే ఆరోపణలు ఆ డాక్టర్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో డాక్టర్‌తోపాటు మరో నలుగుర్ని సైతం సీబీఐ అరెస్ట్ చేసింది.


ఈ కేసులో దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న కొద్దీ విస్మయం గొలిపే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నెల రోజులపాటు డాక్టర్ మనీశ్ రావత్, ఆయన అనుచరులపై నిఘా పెట్టిన సీబీఐ పక్కా ఆధారాలను సేకరించింది. మార్చి 10న రావత్ సహాయకుడు అవ్‌నేష్ పటేల్ సిమ్రాన్ కౌర్ అనే మహిళను సంప్రదించి.. మీ భర్తకు వెన్ను సంబంధిత శస్త్ర చికిత్స చేయాలని చెప్పాడు. సర్జరీ కోసం రూ.1.15 లక్షలను బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తే త్వరగా సర్జరీ జరుగుతుందని చెప్పాడు.


మార్చి 14న మదన్ లాల్, శ్యామ్ అనే పేషెంట్ల అటెండెంట్ల దగ్గర్నుంచి రూ.25 వేలు, రూ.30 వేలు చొప్పున తీసుకొని అదే విషయాన్ని డాక్టర్ రావత్‌కు చెప్పాడు. మనీశ్ శర్మ అనే మరో దళారి సహాయకుడు కుల్దీప్ ఖాతాలోకి రూ.30 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. సయ్యద్ అలీ అనే పేషెంట్ కుటుంబం ఈ మొత్తాన్ని లంచంగా ఇచ్చుకుంది.


డాక్టర్ రావత్ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లంచంగా తీసుకున్న డబ్బును వైట్‌గా మారుస్తున్నాడని కూడా సీబీఐ గుర్తించింది. ఇందుకోసం ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీకి చెందిన గణేష్ చంద్ర అనే వ్యక్తి సాయం తీసుకుంటున్నట్లు గుర్తించింది. మార్చి 22న రావత్‌కు కాల్ చేసిన చంద్ర.. డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్ కోసం పటేల్ ద్వారా డబ్బులు పంపించాలని కోరాడు. మార్చి 23న చంద్రకు ఫోన్ చేసిన పటేల్.. కొందరు పేషెంట్లు లంచంగా డబ్బులు ఇవ్వగానే ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. అన్నట్టుగానే గౌరీ శంకర్ అనే పేషెంట్ ద్వారా చంద్ర ఎస్‌బీఐ ఖాతాలో రూ.35 వేలు జమ చేయించారు. డబ్బులు వచ్చాయని పటేల్‌కు చెప్పిన చంద్ర.. మిగతా మొత్తం కూడా త్వరగా ఇవ్వాలని చెప్పాడు.


రావత్, ఆయన భార్య సూచనల మేరకు లంచం సొమ్మును థర్డ్ పార్టీలకు చెల్లించేవారని.. పోలీసుల విచారణలోనూ తేలింది. తను, తన భార్య కేరళకు వెకేషన్‌కు వెళ్లేందుకు లక్ష రూపాయలను ట్రావెల్ ఏజెంట్‌కు చెల్లించాలని పటేల్‌కు డాక్టర్ రావత్ చెప్పాడనే ఆరోపణలున్నాయి. రావత్ భార్య ఆదేశాల మేరకు పటేల్ ఓ చీరల షాప్‌కు రూ.19 వేలు చెల్లించాడు. ఇలాంటి లావాదేవీలను ఎస్పీ నుపుర్ ప్రసాద్ నాయకత్వంలోని సీబీఐ బృందం అధ్యయనం చేస్తోంది. డాక్టర్ మనీశ్ రావత్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని సఫ్దర్‌జంగ్ హాస్పిట్‌కు సీబీఐ సమాచారం ఇచ్చింది. అరెస్ట్ చేశాక ప్రొసిజర్ ప్రకారం డాక్టర్ రావత్‌ను సీబీఐ వైద్య పరీక్షల నిమిత్తం అదే హాస్పిటల్‌కు తరలించింది.


తన దగ్గర సర్జరీ చేయించుకోవాల్సిన పేషెంట్లు ఓ ప్రయివేట్ సర్జికల్ షాపులోనే సర్జరీకి అవసరమయ్యే పరికరాలు కొనాలని డాక్టర్ చెప్పేవాడు. బయటితో పోలిస్తే అక్కడ ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఆ షాపు ఓనర్ ఓవర్ బిల్లింగ్‌లో డాక్టర్ వాటా ఇచ్చేవాడని సీబీఐ వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com