ఏపీలో కేబినేట్ మార్పు తప్పదు అన్న ప్రచారం సందర్బంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం నుంచి పిలుపువచ్చింది. దీంతో కేబినేట్ మార్పు ప్రచారానికి మరింత బలంచేకూరింది. ఇదిలావుంటే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి మంత్రి సీదిరి అప్పలరాజు వచ్చారు. పశు సంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న సంతాప కార్యక్రమం సందర్భంగా జరిగిన వివాదాస్పద అంశాలను.. ముఖ్యమంత్రికి వివరించడానికే వచ్చానని మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు. అటు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఏపీ కేబినెట్‌లో మార్పులు జరగొచ్చనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. మంత్రి సీదిరి అప్పలరాజు కు సీఎంవో నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో.. సీదిరి అప్పలరాజు తన కార్యక్రమాలను రద్దు చేసుకొని తాడేపల్లికి వచ్చారు. క్యాంప్ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను మంత్రిగా ఉన్నా.. లేకున్నా.. మంత్రినే. నేనే కాదు.. 151 మంది ఎమ్మెల్యేలు మంత్రులే' అని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు తథ్యం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో.. స్పీకర్ తమ్మినేని కూడా సీఎం దగ్గరకు వెళ్లడంతో.. ఏం జరుగుతుందే అనే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌లో మార్పులు జరిగితే.. తమ్మినేని సీతారాంకు అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.