బీజేపీ వర్సెస్ ఆప్ పార్టీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలను వెల్లడించాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టింది. ఆ సమాచారం అవసరం లేదని పేర్కొన్న హైకోర్టు.. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి రూ. 25,000 జరిమానా విధించింది. జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కేజ్రీవాల్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా, ఈ తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. తమ ప్రధాని ఎంత విద్యావంతుడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఆప్ అధినేత ట్వీట్ చేశారు.
‘‘తమ ప్రధాని ఎంత విద్యావంతుడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టులో అతని డిగ్రీని వెల్లడించడాన్ని వారు తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించారు? మరి డిగ్రీ చూమమని అడిగే వ్యక్తికి జరిమానా విధిస్తారా? ఏం జరుగుతుంది? చదువుకోని లేదా అంతగా చదువుకోని ప్రధాని దేశానికి ప్రమాదకరం’’ అని ట్విట్టర్‌లో అసహనం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు కేజ్రీవాల్ 2016లో లేఖ రాశారు. దీనిపై కమిషనర్ స్పందించి.. రాజనీతి శాస్త్రంలో మోదీ మాస్టర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఏలో 62.3 శాతం మార్కులు వచ్చాయని... సెకండ్ ఇయర్‌లో రాజనీతిశాస్త్రంలో 64 మార్కులు, ఐరోపా-సామాజిక రాజనీతిజ్ఞతలో 62 మార్కులు, ఆధునిక భారతదేశం-రాజకీయ విశ్లేషణలో 69 మార్కులు, రాజనీతి మనోవైజ్ఞానిక శాస్త్రంలో 67 మార్కులు వచ్చినట్టు పేర్కొన్నారు.
అయితే, ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీ వీసీకి కేజ్రీవాల్ మరోసారి లేఖ రాశారు. మోదీ డిగ్రీ పట్టాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీ విద్యార్హతల గురించి వెల్లడించాలని ప్రధాని కార్యాలయం, గుజరాత్ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను సమాచార కమిషనర్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టులో గుజరాత్ యూనివర్సిటీ సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపి.. తాజాగా తీర్పును వెలువరించింది.
ప్రధాని ఎన్నికల అఫిడ్‌విట్‌లో ఆయన 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసినట్టు వెల్లడించారు. గత నెలలో ఈ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయమని విశ్వవిద్యాలయాన్ని బలవంతం చేయకూడదన్నారు.
‘ప్రజాస్వామ్యంలో పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేటా లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు.. అలాగే, ఈ సమస్యలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు. అతని గోప్యత కూడా ప్రభావితమవుతుంది..ఒకరి పిల్లతనం, బాధ్యతారహితమైన ఉత్సుకతను తీర్చడానికి సమాచారాన్ని అందించమని మనం అడగలేం’ అని వాదించారు. ఆర్టీఐ కింద అభ్యర్థించే సమాచారం పబ్లిక్ యాక్టివిటీకి సంబంధించినదిగా ఉండాలని కూడా సొలిసిటర్ జనరల్ చెప్పారు. ‘నేను అల్పాహారం ఏం తీసుకున్నాను అని అడగలేరు. కానీ అల్పాహారం కోసం ఎంత మొత్తం ఖర్చు చేశారో అడగవచ్చు’’ అని వివరించారు.
ఈ సమయంలో కేజ్రీవాల్ తరఫున లాయర్ జోక్యం చేసుకుంటూ.. నామినేషన్ పత్రాల్లో విద్యార్హతలు గురించి వివరాలు ఉంటాయని, మేము కేవలం డిగ్రీ మాత్రమే అడుగుతున్నాం.. ఆయన మార్కుల జాబితా కాదని కౌంటర్ ఇచ్చారు. మోదీ విద్యార్హతలను హైలట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టిన సమయంలో ఈ తీర్పు రావడం గమనార్హం.