ఒడిశాలో అరగంట వ్యవధిలోనే వేలాది పిడుగులు పడటంతో జనం హడలిపోయారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన వివరించారు. ప్రతి పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్ కేంద్రానికి ఉందని చెప్పారు.
‘మెరుపు ఫ్లాష్ అనే పదం మొత్తం పిడుగు భూమి మీదకు చేరే సమయాన్ని తెలియజేస్తుంది.. ఇది 0.2 సెకన్ల క్రమాన్ని తీసుకుంటుంది. కానీ ఒక ఫ్లాష్ సాధారణంగా అనేక చిన్న డిశ్చార్జలతో రూపొందుతుంది.. ఇది మిల్లీ సెకన్ల కంటే తక్కువగా ఉంటుంది... బహుళ సంఘటనలను కన్ను గుర్తించలేనంత వేగంగా పునరావృతమవుతుంది..ఈ ఉత్సర్గలను స్ట్రోక్స్ అంటారు.. కొన్నిసార్లు స్ట్రోక్‌లను గుర్తించడానికి తగినంత సమయంలో వేరు చేస్తారు.. మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తుంది’ అని ఉమాశంకర్ దాస్ తెలిపారు. బుధవారం పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
సుందర్‌గఢ్, కింఝోర్, మయూర్‌భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో బలమైన గాలులు, పిడుగు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని సూచించింది. మధ్యధరా ప్రాంతంలో ఉష్ణమండల తుఫాను కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని రోజులుగా ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోనూ గురువారం భారీ వర్షం కురిసింది.