రాజధాని విషయంలో అమరావతి రైతులు రాజీలేని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పాలని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. కొందరు పెత్తందార్లకు కమ్యూనిస్టు నేతలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో కూడా చెప్పాలన్నారు. అమరావతి ప్రాంతంలో చేస్తున్న దీక్షలు 1200 రోజులకు చేరిన సందర్భంగా.. సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
'అధికార వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. అమరావతికి చంద్రబాబు చేసింది ఏమీ లేదు. అమరావతిలో అభివృద్ధికి చంద్రబాబు లక్ష కోట్లు కావాలన్నారు. లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమనేది సీఎం జగన్ అభిమతం. అమరావతిలో వేల కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగింది. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదు. అమరావతి కృతిమ ఉద్యమం అని రుజువైంది. అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వం హామీ ఇచ్చింది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
'కర్నూలులో న్యాయ రాజధాని కావాలని బీజేపీ కోరింది. ఇప్పుడు అన్నీ అమరావతిలోనే ఉండాలని ఎందుకు బీజేపీ స్టాండ్ మార్చింది. చంద్రబాబు ఉచ్చులో ఇతర పార్టీలు చిక్కుకోవద్దు. గుంట నక్కలు, తోడేళ్లు ఏకమై దాడి చేస్తున్నాయి. ఎవరిపైనా దాడులు చేయాల్సిన పని మాకు లేదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ఆరోపణలు చేయొచ్చు. కానీ బూతులు తిట్టే సంస్కృతి ఎక్కడిది? చంద్రబాబు, ఆయనకు మద్దకు ఇచ్చేవారు కావాలనే బూతులు మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు' అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.