ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 08:36 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసినట్లుగానే.. దొంగ ట్వీట్ల ద్వారా టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య మనస్పర్ధలను సృష్టించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఇదంతా తమ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తోందని.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్నారు. అందుకే వెన్నులో భయంతో సోషల్ మీడియాలో దొంగ అకౌంట్లను సృష్టించి, ట్వీట్లను పెడుతున్నారన్నారు. జనసేనతో పొత్తు అవసరం లేదని ఒక టీడీపీ నాయకుడు పేర్కొన్నట్లుగా ట్వీట్ చేశారన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేరిట 76 స్థానాలలో గెలుస్తామని దొంగ ట్విట్ చేసి ఉంటారన్నారు.


ఈ దొంగ ట్వీట్లు చూసి టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు అపోహ పడొద్దన్నారు. నాయకులు బాగానే ఉన్నారని.. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు తనను నమ్మండి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమ పార్టీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి , ఆమె కుమార్తెలను సోషల్ మీడియా వేదికగా అసభ్య పద జాలంతో దూషించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా.. లేకపోతే తమ పార్టీ కోసం పని చేస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు, ప్రజలపై ఈ ప్రభుత్వ అరాచకాలు, దాష్టికాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్ష ఓటు చీలకుండా కొందరు ఎన్ని మాయలు చేసినా టీడీపీ జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు.


ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కాలర్ పట్టుకుని నిలదీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తర కుమారుడిగా సంబోధించిన ఆయన.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ఏ ఒక్కనాడు ఆందోళన నిర్వహించలేదని.. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ సాధన కోసం ఏనాడు ఆందోళన నిర్వహించని వారు, తనని అనర్హుడిగా ప్రకటించాలని మాత్రం పార్లమెంట్లో ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్మలా సీతారామన్‌ని కలిసి పోలవరం కోసం డబ్బులు అడిగాం.. తెలంగాణ ముఖ్యమంత్రి డబ్బులు ఇప్పించమని కోరామని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమన్నారు.


ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం కోసం గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టినట్లుగానే.. ఇప్పుడు వాలంటీర్లు, గృహ సారధులతో ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారని అన్నారు. ఇంటికి స్టిక్కర్ అతికించుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని వాలంటీర్లు గృహ సారధులు బెదిరించే అవకాశం ఉందన్నారు. అయినా భయపడవలసిన అవసరం లేదన్నారు. ఇసుక క్రయ, విక్రయాలలోనూ నగదు లావాదేవీలేలని, పారదర్శకతో ఇసుక అమ్మకాలు అని తరచూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుందని.. ఇసుక అమ్మకాలలో పారదర్శకత అనేది నిజమైతే, రచ్చబండ కార్యక్రమాన్ని నిలిపివేస్తాను అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa