కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభివర్ణించారు. తనను కార్యకర్తలే తమ భుజస్కందాలపై మోస్తున్నారని కొనియాడారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. ధర్మవరం చేనేతకు పుట్టినిల్లు అని లోకేశ్ వెల్లడించారు. ఎంతో చరిత్ర ఉన్న ధర్మవరంలో పాదయాత్ర చేయడం తన అదృష్టమని అన్నారు.
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు 58వ రోజు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొన్నారు. సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ... పాదయాత్రలో తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. తన వాహనం, మైక్, చివరికి స్టూల్ ను కూడా లాక్కున్నారని వివరించారు. కానీ రాయలసీమ ప్రజలు తనకు అండగా నిలిచారని తెలిపారు. తాను టెర్రరిస్ట్ ను కాదని, వారియర్ ని అని ఉద్ఘాటించారు. వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీసీలకు జగన్ వెన్నుపోటు పొడిచారని, బీసీలపై దాదాపు 26 వేల దొంగ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జాకీ, అమరరాజా కంపెనీలను తెలంగాణకు పంపించివేశారని తెలిపారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన చంద్రబాబు అని అభివర్ణించారు. టీడీపీ హయాంలోనే ధర్మవరం అభివృద్ధి జరిగిందని వివరించారు.