నేను కూడా నారా లోకేశ్ మాదిరిగా మాట్లాడితే కుటుంబం మొత్తం బాత్ రూమ్ లో కూర్చొని ఏడుస్తారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు, రూ. 1000 కోట్లను అక్రమంగా సంపాదించారంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి స్పందిస్తూ లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రలో తన ఐడెంటిటీని చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోకేశ్ స్థాయికి తాను దిగజారలేనని.... లోకేశ్ మాదిరే తాను కూడా మాట్లాడితే వాళ్ల కుటుంబం మొత్తం బాత్ రూమ్ లో కూర్చొని ఏడుస్తారని వ్యాఖ్యానించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. లోకేశ్ ను తాను పులకేశి అంటానని చెప్పారు. ఎదుటివారి మీద బురద చల్లి బతకాలనేది వాళ్ల నాన్న లోకేశ్ కు నేర్పించారని అన్నారు.
గత ఎన్నికల అఫిడవిట్ లో రూ. 5 కోట్ల ఆస్తులను చూపించిన కేతిరెడ్డికి ఇప్పుడు వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని లోకేశ్ ప్రశ్నించడంపై ఆయన స్పందిస్తూ... తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎలా చెపుతారని ప్రశ్నించారు. 2024 అఫిడవిట్ లో చూస్తే తన ఆస్తి ఎంతనేది తెలుస్తుందని చెప్పారు. రెండెకరాల చంద్రబాబుకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
చెరువును ఆక్రమించి గెస్ట్ హౌస్ కట్టారనే ఆరోపణపై కేతిరెడ్డి స్పందిస్తూ... వాళ్లు డ్రోన్ తో చిత్రీకరించి చూపించేంత వరకు తన గెస్ట్ హౌస్ అంత అందంగా ఉందనే విషయం తనకు కూడా తెలియదని అన్నారు. తాను చెరువును ఆక్రమించుకోలేదని... అది సర్వే నెంబర్ 904లో ఉందని చెప్పారు. 1938లో పట్టాలిచ్చిన భూమి అని తెలిపారు. తాను ఆక్రమించుకున్నట్టు 24 గంటల్లోపు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే లోకేశ్ పాదయాత్ర ఆపేసి వెళ్లిపోతారా అని సవాల్ విసిరారు.
ప్రతిరోజు వంద ఇసుక టిప్పర్ లను బెంగళూరుకు పంపిస్తున్నారనే ఆరోపణపై స్పందిస్తూ... టిప్పర్ లు రాష్ట్ర సరిహద్దులో కనిపిస్తే బెంగళూరుకు వెళ్తున్నాయని అనుకోవచ్చని... ఇసుక రీచ్ నుంచి టిప్పర్ బయటకు వస్తే అది బెంగళూరుకు వెళ్తోందని ఎలా చెపుతారని ప్రశ్నించారు.