మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం పెరుగుతోంది. దీంతో సామాన్యజనం నానా ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలోని ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో ఓ వీధి కుక్క నవజాత శిశువు దేహాన్ని నోటకరిచి తీసుకెళుతున్న దృశ్యం భయాందోళనలు రేకెత్తించింది. శనివారం ఉదయం ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డు సమీపంలో కుక్క బిడ్డను నోటపట్టి తీసుకెళ్లుతున్న విషయాన్ని అక్కడి వారు గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే, శిశువు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు జరిపిన పరీక్షల్లో తేలింది.
ఇదివుంటే వీధి కుక్క బారిన పడి శిశువు మరణించిందా లేక చిన్నారి మృతదేహాన్ని కుక్క ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిందా అన్ని కోణంలో అధికారులు విచారిస్తున్నారు. శిశువు తల్లిదండ్రులు ఎవరో కూడా ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందో పోస్ట్‌మార్టం తరువాత తెలుస్తుందని వారు చెప్పారు. ఇప్పటికే అధికారులు సమీప ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు.