టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ బుధవారం తన కుటుంబ సభ్యులతో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల గురించి మోదీ ఆరా తీశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కనకమేడల రవీంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ...... ‘‘ఏమిటి రవీంద్ర జీ! మీ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?’’ అని మోడీ అడిగారు. ‘ఏం బాగోలేవు సర్. అధ్వాన్నంగా ఉన్నాయి’ అని రవీంద్ర చెప్పాను.,దీనికి ప్రధాని స్పందిస్తూ... ‘‘నేను అన్నీ తెలుసుకొంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బాగా దెబ్బతినిపోయింది. ఏ కార్యకలాపాలూ సాగడం లేదు. అభివృద్ధి లేకుండా పోయింది. పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల పరిస్ధితులు కూడా దిగజారిపోయాయని రవీంద్ర అన్నప్పుడు... ‘‘అవును! పంజాబ్‌లో మాదిరిగా పరిస్థితులు తయారవుతున్నాయి’’ అని ప్రధాని ప్రతిస్పందించారు. ఐదు కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రం అధోగతిలోకి వెళ్లడం దేశ అభివృద్ధికి దోహదం చేయదని, రాష్ట్రాన్ని మీరే రక్షించాలని ప్రధానిని రవీంద్ర కోరారు. ఇదే సమయంలో... ఆయన సతీమణి ఉష కూడా జోక్యం చేసుకొని మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. అభివృద్ధి ఏ కోశానా కనిపించడం లేదు. ప్రజలు మీ జోక్యాన్ని కోరుకుంటున్నారు’’ అని ప్రధానికి తెలిపారు. వారి మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది. గతంతో పోలిస్తే చాలా భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, దానిని గుర్తించాలని ఆశిస్తున్నామని రవీంద్ర అన్నప్పుడు.... చంద్రబాబు అన్ని విషయాలు తనకు చెప్పారని మోదీ వ్యాఖ్యానించారు. పాలన దెబ్బతిందని కూడా ఆయన అన్నారు. ‘రాష్ట్ర ప్రజలకు మీ ఆశీస్సులు కావాలి’ అని రవీంద్ర అన్నప్పుడు, ‘ఐ విల్ సీ’ అని ప్రధాని బదులిచ్చారు. సుమారు పది నిమిషాలపాటు రవీంద్ర కుటుంబం ప్రధానితో భేటీ అయ్యారు.