అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. ట్రంప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. తన నివాసం నుంచి కార్ల ర్యాలీతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు ట్రంప్ చేరుకున్నారు. వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ఫింగర్ ప్రింట్, ఫొటోలను తీసుకున్న అనంతరం కోర్టు హాలుకు తరలించారు. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్ విషయంలో మినహాయింపులు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.
ఇక, క్రిమినల్ అభియోగాల కింద అరెస్టైన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయమూర్తి జువాన్ మెర్చన్ ఎదుటకు తన న్యాయవాదులతో కలిసి ట్రంప్ వచ్చారు. మాజీ అధ్యక్షుడిపై నమోదైన మొత్తం 34 అభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. అయితే, వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్ విన్నవించారు.
మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోన్న ట్రంప్‌కు ఈ పరిణామం కొంత ప్రతికూలమే. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో తన కున్న శారీరక సంబంధం గురించి బయటకు రాకుండా 2016 ఎన్నికల ముందు ట్రంప్ డబ్బులు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఒప్పందం విషయంలో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించిన 34 నేరాలకు పాల్పడినట్లు మంగళవారం నాడు అంగీకరించారు.
ట్రంప్ విచారణకు హాజరుకావడంతో భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు, రిపబ్లికన్లు కోర్టు సమీపంలోని పార్కు వద్దకు చేరుకున్నారు. సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్‌నకు మద్దతుగా జరిగే ఆందోళనల్లో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే.. వారు ఎంతటివారైనా అరెస్టు చేశామని, శిక్షపడేలా చేస్తామని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ హెచ్చరించారు.
కొంతమంది ట్రంప్ మద్దతుదారులు ప్రాసిక్యూటింగ్ అధికారులను హెచ్చరించడంతో మన్‌హట్టన్ కార్యాలయ వెబ్‌సైట్ బెదిరింపులను నివారించడానికి ‘మీట్ అవర్ టీమ్’ పేజీని తొలగించేంత వరకు వెళ్లింది. డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవని, ఈ కేసును మన్‌హాటన్ అధికార పరిధి నుంచి మార్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించే తృతీయ ప్రపంచ దేశంగా అమెరికా మారుతోందని ఆరోపించారు. కోర్టులో హాజరయ్యే ముందు ఆయన తన మద్దతుదారులకు ఈ- మెయిల్ పంపారు. న్యాయ వ్యవస్థ సచ్చీలతను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని వారికి సూచించారు. ఎలాంటి నేరం చేయకపోయినా ప్రత్యర్థి పార్టీ నేతను అరెస్టు చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు.. నేను చేసిన ఒకే ఒక్క నేరం మన దేశాన్ని నాశనం చేయాలనుకునే వారి నుంచి నిర్భయంగా రక్షించుకోవడం’ అని అన్నారు.