ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు సమకూర్చలేని జగన్ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజల ప్రాణాలు కాపాడతామని చెప్పడం పెద్ద జోక్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. ఇదిలావుంటే ఏపీలో ప్రజల వద్దకే వైద్యుడు కాన్సెప్టుతో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఎందుకూ పనికిరాదని, వైద్యరంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేసి, తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించకుండా కాలయాపన చేసిందని, పీ.హెచ్.సీలు ఉన్నాయో లేవో అనే అనుమానం ప్రజల్లో ఉందని తెలిపారు.
“ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత సిబ్బందిని, వైద్యపరికరాలు, మందుల్ని అందించలేని ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజలప్రాణాలు కాపాడుతుందా? చంద్రబాబు హయాంలో ప్రజలకు అందిన వైద్యసేవలెన్నో, ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న సేవలు ఏమిటో ప్రభుత్వం చెప్పగలదా? తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, 108, 104 వాహన సేవలు, గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వాహన సేవలు చంద్రబాబు హయాంలో నిర్విరామంగా పేదలకు అందుబాటులో నిలిచాయి.
చంద్రబాబు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడనికి తీసుకొచ్చిన అనేకపథకాల్ని జగన్ రాగానే రద్దుచేశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక 108 వాహనాల్ని ఏ2 విజయసాయి వియ్యంకుడి కంపెనీకి ధారాదత్తంచేశాడు. 108 వాహనాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ఉంటాయో ప్రజలకు తెలియని పరిస్థితి కల్పించాడు.