నూజివీడు పరిధిలోని ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి గ్రామంలో ఈ నెల 4న వ్యక్తి వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యగావింపబడ్డాడు.ఐతే దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ....... బొద్దనపల్లికి చెందిన నాగమణికి 2014లో మైలవరానికి చెందిన ఆంజనేయులతో వివాహం జరిగింది. మనస్పర్ధలతో వారు విడిపోయారు. అనంతరం పాలకుర్తి గోపితో నాగమణి సహజీవనం చేస్తూ కోళ్లఫాంలో పనిచేస్తూ ఈదరలో స్థిరపడ్డారు. అక్కడ గోళ్ళ కోటేశ్వరరావుతో నాగమణికి పరిచయమేర్పడింది. వారిద్దరి మధ్య వివాహేత సంబంధం కొనసాగుతోంది. పిల్లలతో సహా కోటేశ్వరరావు దగ్గరకు నాగమణి ఆరునెలల క్రితం వచ్చింది. కోటేశ్వరరావు వ్యవహారశైలి నచ్చకపోవడంతో తిరిగి గోపి దగ్గరకు వెళ్లిపోయింది. కోటేశ్వరరావుతో తరచూ గొడవలు అవుతుండటంతో వీరిద్దరూ కలిసి కోటేశ్వరరావును అడ్డుతప్పించుకోవాలని వేసుకున్న ముందస్తు పథకం ప్రకారం ఈనెల 4న అర్థరాత్రి బొద్దనపల్లి మామిడితోటలో ఉన్న కోటేశ్వరరావుపై గొడ్డలితో దాడిచేసి హతమార్చి అక్కడి నుంచి పారారయ్యారు. హత్యకు పాల్పడిన ఆగిరిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పాలకుర్తి గోపి, బొద్దనపల్లి గ్రామానికి చెందిన గొడపాటి నాగమణిలను అరెస్ట్‌చేసి కోర్టు రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ ఆర్.అంకబాబు నేతృత్వంలోని బృందం నిందితులను యనమదల గ్రామంలోని చెక్‌పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. హత్య జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్న రూరల్ ఎస్సై టి.రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్సై చంటిబాబులను డీఎస్పీ అభినందించారు.