తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమార్జన కేసులో కళ్లు చెదిరే ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కర్ణాటక ప్రభుత్వం నియమించింది. న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని ప్రత్యేక పీపీగా నియమిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం మార్చి 27న ఉత్తర్వులు జారీచేసింది. 1996 నాటి జయలలిత అక్రమాస్తుల కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు.
సాక్ష్యాల రూపంలో 1996 డిసెంబరు 11న చెన్నైలోని జయ నివాసం పోయస్ గార్డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులను ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 7 కిలోల బంగారు లేదా వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు, 11 వేలకు పైగా పట్టుచీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1,040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, విద్యుత్తు పరికరాలు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వీటిని విక్రయించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని గతేడాది అక్టోబరులో కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సీబీఐ లేఖ రాసింది.
ఆర్టీఐ కార్యకర్త టి నరసింహమూర్తి ఈ కేసులో జప్తు చేసిన ఆస్తులు వివరాల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఇదే సయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుంచి కూడా సమాచారాన్ని కోరాడు. దీంతో ఆ వివరాలను కూడా తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దొషేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఒక రూపాయి మాత్రమే వేతనంగా స్వీకరిస్తూ జయలలిత అంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టారని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
1996లో ఆమె అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆమె రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో న్యాయస్థానం చివరికి జయలలితను దోషిగా నిర్థారించింది. జయలలిత ఆస్తులను 66 కోట్లుగా న్యాయస్థానం లెక్క కట్టింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జయ స్నేహితురాలు వీకే శశికళను కోర్టు దోషిగా నిర్దరించడంతో ఆమె జైలు శిక్షను అనుభవించి గతేడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు.