వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎండ తీవ్రతకు తోటు, ఆదివారం కావడంతో వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్ (8), సాయి తేజ (11) మేనమామ శశికుమార్ గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన ముగ్గురూ ఊపిరాడక మృతి చెందారు. గ్రామస్తులు ముగ్గురినీ వెలికి తీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సాయితేజ, సుశాంత్‌ల అమ్మ మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. వీరి బంధువైన జ్ఞానయ్య ఈస్టర్ పండుగ నేపథ్యంలో వీరి ఇంటికి వచ్చాడు. ఆదివారం కావడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ పిల్లలకు మేనమామ అయిన శశికుమార్‌తో కలిసి అందరూ కాలువలో ఈతకు వెళ్లారు.
నలుగురూ ఈత కోసం కాలువలోకి దిగారు. అయితే, కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ, మిగిలిన ముగ్గురూ కాలువలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.