యూపీలోని వారణాసికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర పరాభవం ఎదురైంది. శుక్రవారం వారణాసికి వచ్చిన తేజ్ ప్రతాప్.. ఓ హోటల్‌లో బస చేశారు. ఆయన బయటకు వెళ్లిన సమయంలో మంత్రి లగేజితో పాటు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను హోటల్ నిర్వాహకులు బయటపడేశారు. రాత్రి హోటల్‌కు తిరిగి చేరుకున్న బిహార్ మంత్రి తమ లగేజి రిసెప్షను వద్ద ఉండటం చూసి షాకయ్యారు. తమకు కేటాయించిన గదిని తాము లేని సమయంలో తెరవడమే కాకుండా.. వస్తువులను బయట పడేశారని తేజ్‌ప్రతాప్ యాదవ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఏసీపీ సంతోష్‌సింగ్ మాట్లాడుతూ.. ‘‘సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ పేరిట ఏప్రిల్ 6 గురువారం రాత్రి ఒక్కరోజుకు మాత్రమే గదిని బుక్ చేసినట్లు హోటల్ యాజమాన్యం చెప్పింది... శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడంతో బయటకు వెళ్లిన మంత్రి కోసం ఎదురుచూసి, చివరకు లగేజీని రిసెప్షన్ వద్దకు చేర్చినట్లు తెలిపారు.. లగేజీ తేజ్ ప్రతాప్ యాదవ్‌దని వారికి తెలియదు’’ అని చెప్పారు.
మరో పోలీస్ అధికారి మాట్లాడుతూ.. బిహార్ మంత్రి ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘గదిలో నుంచి తేజ్ ప్రతాప్‌కి చెందిన లగేజీని బయటకు తీసుకొచ్చినవారిలో హోటల్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నట్టు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది.. మంత్రి భద్రతకు సంబంధించింది కావడంతో ఎఫ్ఐఆర్ నమోదుచేశాం.. ’ అని పేర్కొన్నారు. దర్శనం తర్వాత తిరిగొచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.