బెంగళూరులోని ఓ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఎన్నారై కోటా సీటు ఏకంగా రూ.64 లక్షలు పలకడం గమనార్హం. ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ సీట్లను ఎన్నారై, మేనేజ్‌మెంట్ కోటాల్లో గత ఏడాది రూ.64 లక్షలకు ఆఫర్ చేసింది. ఫీజు మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలని తల్లిదండ్రులను కోరింది. ఇంత ఫీజు చెల్లించేవారికి కదా సీటు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. ముందుగా వచ్చిన వారికి మాత్రమే సీటు దొరికినట్లు ఆ కాలేజీ చెప్పింది. ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల ఫీజులు కూడా గత ఏడాది రూ.46 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరిగాయి.
ఈ ఒక్క కాలేజీలోనే కాదు.. పీఈఎస్ యూనివర్సిటీ, బీఎంస్ కాలేజీ లాంటి చోట్ల కూడా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ఫీజు భారీగా పెరిగింది. కంప్యూటర్ సైన్స్ కోర్సు పట్ల జనాల్లో ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం అని నిపుణులు చెబుతున్నారు. తమ పిల్లాడు కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీటు తెచ్చుకుంటే భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు భావించడం కూడా ఈ కోర్సు డిమాండ్ పెరగడానికి కారణమైంది. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా చాలా మంది పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడానికి వెనుకాడటం లేదు.
ఒకప్పుడు మెడిసిన్ సీట్లకు మాత్రమే మేనేజ్‌మెంట్ కోటా కోసం భారీ మొత్తంలో చెల్లించేవారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాల పుణ్యమా అని బీటెక్ కోర్సులకు కూడా అరకోటికిపైగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు నెలకు రూ.10-20 వేల జీతంతో కెరీర్ మొదలుపెడుతున్నారు. కానీ బీటెక్ పూర్తి చేసిన వారేమో ఏడాదికి రూ.15-20 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభిస్తున్నారని ఓ డాక్టర్ తెలిపారు. ప్రాణాలను నిలిపే డాక్టర్లు తక్కువ వేతనాలతో ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. వైద్యం అనేది సమాజ సేవ అయినప్పటికీ.. అందరిలాగే తమకు అన్ని అవసరలు ఉంటాయి కదా అన్నారు. సిగరెట్లు, ఆల్కహాల్ తయారు చేసే కంపెనీలు అపరిమితంగా సంపాదిస్తున్నాయని.. కానీ డాక్టర్లకు అలా కుదరదన్నారు. డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, టీచర్లు, భద్రతా దళాల ప్రాధాన్యం గుర్తించినప్పుడే ఈ సమాజం గొప్పగా మారుతుందని డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి తన ట్వీట్లలో పేర్కొన్నారు.