స్నేహమంటే ఇదేరా అని పించేలా ఓ మిత్రడు తన దోస్త్ యాదిలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాడు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వై ఎవరైనా హెల్మెట్ లేకుండా బండి నడిపే ప్రయత్నం చేస్తే ఓ వ్యక్తి వారికి బ్రేక్‌లు వేస్తాడు. ఉచితంగా హెల్మెట్ అందించి, దాని ప్రాధాన్యతను వివరిస్తాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్పి వారిని పంపుతాడు. బిహార్‌కు చెందిన అతడి పేరు రాఘవేంద్ర కుమార్. గత నెలలో రాఘవేంద్ర కుమార్ హెల్మెట్లు పంపిణీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, రాఘవేంద్ర నిస్వార్థ సేవ వెనుక ఓ బలమైన కారణం ఉంది.
తొమ్మిదేళ్ల కిందట రాఘవేంద్ర ప్రాణ స్నేహితుడు వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. యుమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడు నడుపుతోన్న బైక్‌ను ఢీకొంది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే రాఘవేంద్ర స్నేహితుడు మృతిచెందాడు. ఈ సంఘటన రాఘవేంద్రను తీవ్రంగా కలచివేసింది. హెల్మెట్ ధరించి ఉంటే తన ప్రాణ మిత్రుడు బతికే ఉండేవాడని భావించాడు. తన స్నేహితుడి పరిస్థితి మరొకరికి రాకూడదనే మంచి ఉద్దేశంతో తొమ్మిదేళ్ల కిందట రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు.
ఇప్పటి వరకు బీఎస్ఐ మార్క్ ఉన్న నాణ్యమైన 56,000 హెల్మెట్లను ఉచితంగా పంచిపెట్టాడు. ఈ సేవ పట్ల అతడు ఎంత పిచ్చిగా ఉన్నాడంటే.. గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్‌ను అమ్మడమే కాదు.. తన భార్య ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఆ వచ్చిన సొమ్ముతో హెల్మెట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. రాఘవేంద్ర సేవలపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్‌లు ప్రశంసించారు. రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు.
‘నన్ను పిచ్చివాడు అనుకున్నా కానీ, నేను ఉచిత హెల్మెట్ల పంపిణీ ఆపను.. రహదారి భద్రతపై నా ప్రయత్నం చేస్తాను.. హెల్మెట్లు కొనడం, నా కుటుంబాన్ని చూసుకోవడం వంటి ఖర్చులు ఏకకాలం కష్టంగా మారింది.. రాబోయే కొద్ది వారాల్లో నేను బీహార్ కైమూర్ జిల్లాలోని నా పూర్వీకుల గ్రామమైన భదరీకి వెళ్లిపోతాను.. నాకు ఆరేళ్ల కొడుకు (అన్ష్ సింగ్) ఉన్నాడు.. అతడిని మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని భావిస్తున్నాను.. కానీ నేను హెల్మెట్‌లు కొని ప్రాణాలు కాపాడతాను’ అని రాఘవేంద్ర తెలిపాడు. స్వచ్ఛంద సేవకుడిగా మారడానికి ముందు అతడు పలు బహుళజాతి సంస్థల్లో లీగల్ అడ్వైజరీగా పనిచేశాడు.