స్వయంపాలిత తైవాన్‌ను తమ భూభాగంగా వాదిస్తోన్న చైనా.. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా, తైవాన్ పరిసరాల్లో మూడు రోజుల సైనిక విన్యాసాలను చేపట్టింది. తైవాన్ చుట్టుపక్కల శనివారం నుంచి మూడు రోజుల పాటు సైనిక విన్యాసాలు ప్రారంభమవుతాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రకటించారు. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
తైవాన్ ద్వీపం చుట్టూ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పోరాట సన్నద్ధత గస్తీ, విన్యాసాలను నిర్వహించే ప్రణాళికను రూపొందించామని చైనా సంక్షిప్త ప్రకటన జారీచేసింది. తైవాన్ పరిసరాల్లోకి 42 యుద్ధ విమానాలు, 8 నౌకలను చైనా పంపినట్టు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ తెలిపింది. వీటిలో 29 సరిహద్దు రేఖను దాటినట్టు పేర్కొంది. అమెరికా పర్యటనకు వెళ్లిన తైవాన్ అధ్యక్షురాలు.. లాస్ ఏంజెల్స్‌లో ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్ విషయంలో చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా, తైవాన్ మధ్య సంబంధాలపై ప్రతికారంతో రగిలిపోతోన్న చైనా.. బెదిరింపులకు పాల్పడుతోంది. గతేడాది ఆగస్టులో అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనపై చైనా ఆగ్రహంతో రగిలిపోయింది. ప్రత్యక్ష క్షిపణి ప్రయోగాలతో సహా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలను చేపట్టింది. అమెరికాలో మెక్‌కార్థీతో సమావేశానికి తైవాన్ అధికారులు తక్కువ ప్రతిస్పందనను ఊహించారు. అయితే చైనా మరిన్ని విన్యాసాలు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కూడా చెప్పారు.
తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనను చైనా తీవ్రంగా ఖండించింది. తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి ఝా ఫెంగ్లియన్ మాట్లాడుతూ.. కేవలం హౌటల్‌లో బస చేయడమే కాదు, అమెరికన్ అధికారులతోనూ ఆమె సమావేశం అవుతున్నారని మండిపడ్డారు. స్పీకర్‌తో సమావేశం కచ్చితంగా మరో కవ్వింపు చర్య కాగలదని, ఇది ఒకే చైనా అన్న సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తోందని, తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కచ్చితంగా దీనిపై పోరాడుతామని చెప్పారు.